Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page

భాషావిజ్ఞాన ప్రయోజనం

నగరజీవితాలతో నాగరికత ముదిరింది. నాగరికతముదిరిన కొద్దీ గ్రామాలు క్షీణించిపోయినవి. గ్రామస్థులు నగరవాసు లయినారు. గ్రామజీవనంలో పొదుపు ఉండేది. అవసరమైన వస్తువులకొరకే పాటుపడేవారు. ఆభరణాల ఆశ వారికి తక్కువగా ఉండేది. కుటీరాలు నిర్మించుకొని సుఖంగా నియమిత జీవనం చేసేవారు. వర్ణభేదా లుండేవి. కాని వానివల్ల పౌరుల యోగక్షేమాల కేవిధంగానూ కొరత ఉండేదికాదు.

గృహాడంబరమూ వేషాడంబరమూ నాగరికతకు తోబుట్టువులు. బుద్ధి విషయాలలో చిక్కి పాపాచరణకు పూనుకొంటున్నది. ఆశలకు అంతులేకుండా ఉంది. అవి తీరీకొద్దీ క్రొత్తఆశలు, క్రొత్తపాపాలు. పాపమూలంగా జన్మపరంపర కల్గుతుంది. నాగరికతా ఫలంగా కల్గే దోషాలు మనకు అంటనట్లు మన బుద్ధిశక్తులను పరమేశ్వరార్పణ చేసి వాస్తవ ప్రయోజనం పొందడానికి, జన్మరాహిత్యంకోసం, చంద్రమౌళీశ్వరునిఅనుగ్రహంకోసం అందరమూ పాటుపడుతూ ఉందాం.

ప్రాణిలోకంలో ప్రతిదానికీ మనోభావా లున్నాయి. వానిని వ్యక్తంచేయడానికి వాక్కు ఏర్పడింది. వాక్సౌలభ్యం లేకపోయిందంటే హృదయంలోని మనోభావాలన్నీ అజ్ఞాతంగానే ఉండిపోతవి. వాక్కు శబ్దస్వరూపం. అది ధ్వన్యాత్మకమనీ, వర్ణాత్మకమనీ రెండువిధాలు. అవ్యక్తమైన శబ్దాన్ని ధ్వని అంటారు. వ్యక్తమైన శబ్దం వర్ణాత్మకం. ధ్వన్యాత్మకశబ్దంలో కూడా స్వరభేదంమూలాన హృదయభావంలోని ఛాయలన్నీ గోచరిస్తుంటవి. గోమాత ఆకలిమంటచే చేసే శబ్దానికీ, లేగ దూడను చూచి సంతోషంగా అరచే అంభారావానికీ ఉన్న తేడా మనకు ఇట్టే తెలిసిపోతుంది.

సూక్ష్మభావగ్రహణానికి వ్యక్తశబ్దంఅవసరం. అకారాదిక్షకారాంతం వుండేభాషే వ్యక్తభాష. అక్షరాలులేనిభాషలు కూడా పూర్వం ఉండేవి. వానినే వ్లుెచ్ఛభాషలనేవారు. 'మిచ్ఛ' 'అవ్యక్తశ##బ్దే' వ్యక్తంకానిదే అవ్యక్తం. ఇంగ్లీషులో అవ్యక్తశబ్దాలు కొన్ని ఉన్నవి. అంటే ఒక్కొక్కఅక్షరానికి నిర్దిష్టశబ్దం లేదని అర్థం. అంటే వ్యక్తమైన విభాగం లేదన్నమాట. 'ఈ' అనే అక్షరం ఉంది. ఇట్లు అక్షరాలకు నిర్దిష్టధ్వనిలేక, ఒక్కొక్కఅక్షరానికి వివిధవిధాలైన శబ్దాలు, ఒక్కొక్క శబ్దానికి వివిధాక్షరాలున్నూ కల్గిన భాష ఆంగ్లభాష. ఒక్క 'క' కారానికి ఈ, , ఔ, అనే మూడుఅక్షరాలు ఉపయోగింపబడుతున్నవి. ఇట్లే వొవెల్సు అనబడే ఆ, ఊ, ఒ, క్ష, ీ లకు సైతం ఒక్క స్వరం లేదు. ీి అను శబ్దములో అకారమున్నూ ఉన్నది. ఇది అభ్యాసకులకు అమితకష్టం కలిగిస్తుంది. మనదేశ భాషలలో అక్షరాలసంఖ్య యెక్కువ. శ్రమపడి ఒక్కమారు పెద్దబాలశిక్ష సాధించామంటే, శబ్దాన్ని గూర్చిన శ్రమ మరి ఉండదు. ఆంగ్లం విషయం అట్లు కాదు. యమ్‌.ఎ. చదివిన వాడికిన్నీ, పదోచ్చారణవిషయంలో సందేహమే; నిఘంటువులు తిరగేయవలసినదే.

సంస్కారం చేయబడిన భాష కాబట్టి దేవభాషకు సంస్కృతమని పేరు వచ్చింది. సమస్తశబ్దాలూ, ఈ అకారాదిక్షకారాంతమైన అక్షమాలలో ఇమిడిఉన్నవని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.

అక్షరాలకు లిపి అని ఒకపేరు. మనోభావాలను వాగ్రూపంలోకాక రేఖారూపంగా వ్యక్తపరచే సాధనావిశేషమే లిపి. ఆ రేఖాస్వరూపం చూచి, అక్షరాలను పోల్చుకోవాలి. 'క' అని వ్రాసినామని అనుకోండి. అది శబ్దం కాదు. అది దానికి సంకేతం. ఒకభాషకు అనేకలిపు లున్నవి. సంస్కృతాన్ని దేవనాగరంలోను, తెనుగు, కన్నడము, మళయాళము, మరాటీ, బెంగాలీ, హిందీ, గుజరాతీ - అక్షరాలలోనూ వ్రాస్తున్నారు. అట్లే ఒకలిపిలో అనేకభాషలు వ్రాయబడవచ్చును. తెనుగు లిపిలో ద్రావిడంలోని దివ్యప్రబంధాలను ముద్రించి ఉన్నారు. తెనుగువైష్ణవులు వీనిని చదువుతూ వుంటారు. ఐరోపీయ భాషలురోమన్‌ లిపిలో వ్రాయబడుతున్నవి. ఆంధ్రభాషను గూర్చి ఆంధ్రలిపినిగూర్చి కొంత పరిశీలిద్దాం. ఈ రెంటిలోనూ కొన్ని విశేషా లున్నవి. పరాశక్తి యంత్రానికి తెనుగులిపి ఉపయోగింపబడ్డది. పరాశక్తి స్త్రీస్వరూపిణి. అంబికకు వామావర్త పూజ ఏర్పడిఉన్నది. ఆంధ్రలిపికూడా వామావర్తమైనది. అనగా ఎడమప్రక్క చుట్టివ్రాయబడేది. తక్కినవి దక్షిణావర్తమైనవి. ఆవర్త మనగా చక్రం. తెనుగు వర్తులాకారలిపి, అందులోనూ వామావర్తం. వామావర్తపూజ లందుకొనే అంబికయొక్క యంత్రంలోనూ చక్రంలోనూ ఆంధ్రలిపి వున్నది. అందుచే తెనుగులిపి పరాశక్తి ప్రధానమై ఉన్నది. తెనుగుభాష శివప్రదానం. లిపి శక్తిస్వరూపం. భాష శివ స్వరూపం. వాగర్థాలు పార్వతీపరమేశ్వరులనికదా కాళిదాసు రఘువంశంలో అన్నాడు. ఆంధ్రభాష శివప్రధానమైన దని గుర్తించినది అప్పయదీక్షితులవారు. వారు పరమశివభక్తులు. దక్షిణాదిని, ఆరణి అనుఊరికి సమీపంలోఉన్న ఆడెయపాలెం వారిజన్మక్షేత్రం. దక్షిణాన శివోత్కృష్టత స్థాపించినవారు ఈక్రిందిశ్లోకం చెప్పారు.

ఆంధ్రత్వ మాంధ్రభాషా చా ప్యాంధ్రదేశః స్వజన్మభూః,

తత్రాపి యాజుషీ శాఖా నాల్పస్య తపసః ఫలమ్‌||

ఆంధ్రం త్రిలింగదేశం. దేశ##మే లింగావర్తం. దక్షిణాన దక్షిణకాశి కాళహస్తిక్షేత్రం ఉన్నది. పడమట శ్రీశైలక్షేత్రమున్నూ, ఉత్తరమున కోటిలింగక్షేత్రమున్నూ ఎల్లలుగాకలది ఆంధ్రదేశం. అట్టి త్రిలింగదేశంలో తాను జన్మించలేదన్న విషయమూ ఆంధ్రభాష తన మాతృభాష కాకపోయినదే అన్నసంగతీ ఆయనకు కొరతయట. ఇవి రెండేకాక మరొక్క కొరతకూడా ఆయన కున్నదిట.

ఆంధ్రులు శైవులైనా సరే, వైష్ణవులైనాసరే, అక్షరాభ్యాస సమయంలో ''ఓం నమః శివాయ'' అని చదువు ప్రారంభిస్తారు. జన్మతారకమైన శివపంచాక్షరి జీవితానికి ప్రథమ సోపానంగా ఈభాష నేర్చేవారికి ఏర్పడిఉన్నది. పంచాక్షరి, యజుర్వేదమధ్యంలో ఉన్నది. అంటే యజుర్వేదం శివసంబంధమైనది. దానికి తగినట్టు ఆంధ్రులలో యజుఃశాఖేయులు ఎక్కువమంది. సామశాఖీయులులేనేలేరు. ఋగ్వేదుల సంఖ్యకూడా తక్కువ. ఇట్లా సామశాఖేయులున్నూ పరమశివ భక్లులున్నూ అయినఅప్పయదీక్షితులవారుశివసంబంధాధికమైన ఆంధ్రదేశంలో జన్మించకపోతినే అని విచారపడేవారట. ఆంధ్రానికి లిపి శక్తిస్వరూపమై, భాష శివస్వరూపమై ఎల్లలుత్రిలింగములై, వేదము యజుర్వేదమై ఒప్పందం ఒక విశేషం.

తెనుగులిపి వామావర్తం. వ్లుెచ్ఛభాషలు దక్షిణావర్తలిపి కలవి. మనశాసనాలు పరిశీలిస్తే, రెండు రకాలైన లిపులు ప్రచారంలో వుండేవని తెలుస్తుంది. అందు ఒకటి బ్రహ్మలిపి, మరొకటి ఖరోష్ఠీ. బ్రహ్మలిపిని చదవడం కష్టం. ఇప్పుడుకూడా సరిగా అర్థంగాని వ్రాతలను 'ఇదేమి బ్రహ్మలిపిగాఉన్నది' అంటూ ఉంటాము.

ఖరోష్ఠము - అనగా గాడిద పెదవులవలె బహిర్గతమై ఆ లిపి ఉన్నందున దానికి ఖరోష్ఠలిపి అన్నపేరు.

మనకు లిపి ఉన్నది. భాష ఉన్నది. అయితే వీనిప్రయోజనం ఏమిటి? మృగాలకు భాష లేదు. లిపి లేదు. వానికి పత్రికలు, పుస్తకాలూ, అచ్చుయంత్రాలు ఎవీ లేవు. ఇవన్నీ మన కున్నాయి. మనకు మృగాలకంటె ఏదైనా ఎక్కువ సౌఖ్యాన్ని, ఈపదార్థపరదవారం పంచిపెట్టుతున్నదా? ఇవి లేకపోతే ఏమి? ఇవన్నీ లేనిప్రాణులనుచూస్తే ఒక్కొక్కపుడు అవే మనకంటె సౌఖ్యంగా ఆనందంగా ఉన్నట్టు తోస్తుంది. వాని వృద్ధి అనంతంగా వుంది. వ్యాధి ఉన్నట్టుగా తోచదు. గతాన్ని గూర్చిన చింతగాని, భవిష్యత్తునుగూర్చిన బెంగకాని వాని కున్నట్టు కనుపించదు. ఏరోజు కారోజు, వలసినంత సంపాదించుకొని ఆనందంగా ఉంటవి. మేతకు అడవులకు వెళ్ళినపుడు అక్కడవిహారం చేసే మృగరాజులనోట్లో ఫలహార మవుతున్నావాని జనాఫా తగ్గినట్టు కనిపించదు. కనపడిన పాములను కనబడిన చోట్లలో చంపుతున్నాం. వానిసంఖ్యతగ్గినట్లు కనబడదు. ఇన్ని సౌఖ్యాలనూ, ఇన్ని వస్తువులనూ, మనచుట్టూ ఉంచుకొని కూచున్న మనకు ఆనందం లేకపోతే, ఈ వస్తువులు సంపాదించడానికి పడే శ్రమలూ దుఃఖాలూ ఎందులకు?

పరిశీలిస్తే ఏయేచోట అచ్చుయంత్రాలూ పాఠశాలలూ లేవో, ఆచోట్లలో-ఆఫ్రికావంటిదేశాలలో-మిగతాచోట్లలో ఉన్నంతన్యాయస్థానాలుకాని అక్రమచర్యలుకానీ అగుపించవు. అక్కడ అకార్యాలు తక్కువ అని అనిపిస్తుంది. నాగరికతతో కూడిన విద్యాభ్యాసం వృద్ధి అయ్యేకొద్దీ పాపాచరణకూడా అనులోమనిష్పత్తిలో అధిక మవుతున్నది. పాపం చేయాలన్న విచిత్రబుద్ధి కల్గుతున్నది. ఈపాపకార్యాలమూలంగా వ్యాధి, దారిద్ర్యం మొదలగు అనిష్టాలతో పాటు పునర్జన్మకు కావలసిన బీజాలను నాటుతున్నాము. మృగతుల్యుల మవడమేకాక, మృగాలకంటే హీనులమైపోతున్నాము.

ఈశ్వరుడు మనకు బుద్ధిని ప్రసాదించినాడన్న విషయం గోచరమవుతూనే ఉన్నది. ఆయన బుద్ధినే కాక, శక్తినీ, శాస్త్రాన్నీకూడా ఇచ్చాడు. ఇట్టి మనకు ప్రసాదించినది అనుగ్రహసూచకమా? అపరాధసూచకమా? ఆయన యిచ్చింది అపరాధమే అయితే మనకు ఈ మనుష్యజన్మ ఎందుకు? మృగాలుగానే ఉండిపోవచ్చునే? మానవజన్మ దుర్లభమనీ, దానిని సద్వినియోగం చేసుకోవాలనీ పెద్దలుచెప్పారు. అందుచే పరమేశ్వర ప్రసాదితమైన బుద్ధి పాపాచరణకై ఉపయోగించక పాపక్షాళనకై వినియోగించాలి.

ప్రపంచంలో ఏఒక్కవస్తువునైనా, ఉపయోగించడంలో ఉంది తెలివి. కత్తితో క్షత్రియుడు శత్రుసంహారంచేస్తున్నాడు. మరొకడు అడవిలో కట్టెలు కొడుతున్నాడు. అట్లే భాషను, లిపినీ, బుదినీ మనం పాపాచరణకూ వినియోగించవచ్చు; పుణ్యార్జనకూ ఉపయోగింపవచ్చు. భాషాజ్ఞానం ఒక్కొక్కప్పుడు పాపార్జనకు కారణ మవుతున్నా ఎంతో మంది మహానుభావులకు నిశ్శ్రేయసలాభం కల్గించింది. అందుచే బుద్ధి మనకు అవసరమయిన దేయని అంగీకరించక తప్పదు. సహస్రబ్రాహ్మణ సంతర్పణ అని చేస్తుంటారు. కొందరు 'వీళ్ళంతా వట్టి సోమరి మూక, అనవసరంగా వీళ్ళపొట్టలు నింపడమేమిటి?' అని అవహేళనచేయవచ్చు. కాని వాళ్ళలో ఒక్కమహాత్ముడున్నా చాలు 'సుఖీభవ' అని అతడు అన్నదాతకు చేసే ఆశీర్వాదం ఒక్కటి జన్మసాఫల్యకారణ మవుతుంది. ఈ ఒక్కరిని ఉద్దేశించే తక్కినవారికి చేసిన పరిచర్య అంతా.

పొలానికి వెళ్ళి పండిస్తేకాని, గింజలురావు. ఉద్యోగం చేస్తేకాని జీతం రాదు, ఊరక కూర్చుంటే ఏదీ రాదు. 'కష్టే ఫలీ' కష్టపడితేనేసుఖం. అట్లే పాపాన్నీ దుఃఖాన్నీ అనుభవిస్తే కాని సుఖం కలుగదు. మనుష్యజన్మలోనే సుఖాపాదకమైన కార్యాలు మనం చక్కబెట్టుకొవాలి. లేకుంటే ఏంసాఫల్యం? దేవు డిచ్చిన నాలుకతో పరులను నిందించనూవచ్చు' పరమేశ్వరుణ్ణి స్తుతించనూవచ్చు.


Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page